Astrologer Attempts Suicide: ఓ జ్యోతిషుడు తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తమిళనాడు కోయంబత్తూర్లో జరిగింది. ఈ ఘటనలో ఆయన తల్లి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని కృష్ణకుమారిగా గుర్తించారు. భూమి వివాదానికి సంబంధించి ఓ వ్యక్తి చేసిన మోసం ఆరోపణలతో జ్యోతిషుడి కుటుంబం చనిపోవాలని నిర్ణయించుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. హిందూ మక్కల్ కట్చి జ్యోతిష విభాగానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు ప్రసన్న స్వామి. చెన్నై ఓల్డ్ వన్నారపేట్కు చెందిన ఓ వ్యక్తి చెంగల్పట్టులో ట్రావెల్ కంపెనీని నడుపుతున్నాడు. ఆ వ్యాపారి భూ వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో అతడు ప్రసన్న స్వామిని ఆశ్రయించాడు. తనకు తెలిసినవారి ద్వారా సమస్యను పరిష్కరిస్తానని, మాంగళ్య పూజ కూడా చేయించాలని చెప్పారు జ్యోతిషుడు. దీంతో నమ్మిన వ్యాపారి.. తన భార్య 15 సవర్ల గొలుసును ప్రసన్న స్వామికి ఇచ్చాడు.
అయితే.. ఎంతకూ సమస్య పరిష్కారం కాకపోగా.. ప్రసన్న స్వామిపై వ్యాపారి సెల్వపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. పోలీసులు స్వామి, ఆయన భార్య అశ్విని సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దీనిని భరించలేని స్వామి తన భార్య, కూతురు, తల్లితో కలిసి ఆత్మహత్యకు యత్నించారు. తమ పరిస్థితికి వ్యాపారి, అతడి కుటుంబమే కారణమని, వాట్సాప్లో వీడియో షేర్ చేసి పురుగుల మందు తాగారు. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించగా.. ప్రసన్న స్వామి తల్లి కృష్ణకుమారి చనిపోయింది. మిగతా ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
ఆ అనుమానంతో గ్రామస్థుల మూకదాడి.. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో.. ఓ వృద్ధుడ్ని గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ ఘటన ఒడిశా రాయగడలోని తిటిగూడలో జరిగింది. మృతుడిని దై మాఝీగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఇతడి ఇద్దరు కుమారులు.. అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలు నిలుపుకున్నారు.
మాఝీ తన భార్య, ఇద్దరు కుమారులతో బుధవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా.. గ్రామస్థులు మూక దాడి చేశారు. వృద్ధుడు అక్కడికక్కడే మరణించగా.. కుమారులు తప్పించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.