పశ్చిమ్ బంగాతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. కరోనా విజృంభణ సమయంలోనూ బిహార్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ప్రస్తుతం ఏర్పాట్లను సమీక్షిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
శాసనసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అసోం, పశ్చిమ బెంగాల్‌లో పర్యటించింది. తాజాగా బుధ, గురు వారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించనుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో ఆరు నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, అసోంలో మాత్రం రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్లు సమాచారం.