తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గొగోయి​ నిర్ణయంతో అసోం ప్రాంతీయ పార్టీల్లో జోష్​

ఎన్నికల ముందు అసోం రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. జైలు నుంచే పోటీ చేస్తానన్న రైతు నేత అఖిల్‌ గొగోయి‌ ప్రకటనతో ప్రాంతీయ పార్టీలకు ఊతం లభించినట్లైంది. మరోసారి అధికారం కైవసం చేసుకోవాలన్న భాజపా ఆశలకు అఖిల్‌ ఎంతవరకు గండి కొడతారనేది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్‌లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల్‌ గొగోయి‌ ప్రభావంపై ప్రత్యేక కథనం.

గొగోయి​ నిర్ణయంతో అసోం ప్రాంతీయ పార్టీల్లో జోష్​
Assam's regional forces get booster as Akhil Gogoi to contest April polls from jail

By

Published : Jan 19, 2021, 9:53 AM IST

అసోంలో వచ్చే ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేస్తానన్న ప్రముఖ రైతు నాయకుడు, క్రిషక్‌ముక్తి సంగ్రామ్‌ సమితి అధినేత అఖిల్‌ గొగోయి‌ ప్రకటనతో అక్కడి ప్రాంతీయ పార్టీల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో అఖిల్‌ పార్టీకి నాయకత్వం వహించడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన పార్టీ రాయ్‌జోర్‌ దళ్‌ వెల్లడించింది. ఈ మేరకు పౌరచట్ట వ్యతిరేక ఆందోళనల్లో ఉద్భవించిన అసోం జాతీయ పరిషద్‌(ఏజీపీ)తో కలిసి పోటీ చేస్తామని తెలిపింది.

దేశద్రోహం అభియోగాల కింద గత ఏడాది కాలంగా జైల్లో ఉంటున్న అఖిల్‌ గొగోయి బెయిల్‌ కోసం క్రిషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో అసోంలో భాజపాను గద్దె దించాలని భావిస్తున్న ప్రాంతీయ నేతలకు కొత్త శక్తి వచ్చినట్లైంది. అఖిల్‌ గొగోయి‌ జైలు నుంచి పార్టీని నడిపిస్తారని శివ్‌సాగర్‌, టియోక్‌ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాయ్‌జోర్‌దళ్‌ పేర్కొంది. అసోంపై గట్టిపట్టున్న విద్యార్థి సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన ఏజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తానన్న రాయ్‌జోర్‌ ప్రకటన ఆ రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది.

ప్రాంతీయ శక్తులపై ప్రభావం..

నిరాడంబరతకు మారుపేరుగా ప్రసిద్ధి పొందిన అఖిల్‌ గొగోయి‌కి, ఆయన సంస్థ క్రిషక్‌ముక్తి సంగ్రామ్‌ సమితికి అసోంలోని వివిధ జిల్లాల్లో గట్టి పట్టుంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల సమయంలో అఖిల్‌ గొగోయి‌ పిలుపు మేరకు వేలాది మంది ఉద్యమ బాట పట్టారు. ఈ ఆందోళనల సమయంలోనే అఖిల్‌ గొగోయిపై కేసు నమోదైంది. అనంతరం ఆ కేసు ఎన్​ఐఏకు బదిలీ అయింది. అప్పటి నుంచి అఖిల్‌ జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. అఖిల్‌కు వ్యతిరేకంగా ఎన్​ఐఏ 18 సాక్ష్యాలను సంపాందించింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపించింది. అయితే అఖిల్‌పై విచారణ ప్రారంభం కాలేదు.

దోషిగా నిరూపితం కానంతవరకు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అఖిల్‌ తరపు న్యాయవాది చెబుతున్నారు. గొగోయి‌ నిర్ణయం ఎన్నికల ముందు ప్రాంతీయ శక్తులపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details