అసోం-మిజోరం సరిహద్దు వివాదం ఉన్నట్టుండి ఎందుకంత తీవ్రరూపు దాల్చింది. కాల్పుల వరకు ఎందుకు దారితీసింది? సోమవారం నాటి ఘర్షణపై ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషిస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. సరిహద్దు అంశంలో నెలకొన్న విభేదాలపై రెండు రాష్ట్రాల అధికారులు సోమవారం చర్చలు జరుపుతుండగా ఉన్నట్టుండి మిజోరం వైపు నుంచి తూటాల వాన మొదలైనట్లు అస్సాం అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఆరుగురు సిబ్బంది మరణించగా, 70 మందికిపైగా గాయపడ్డారు.
ఈ కారణంగానే పోలీసులు మృతి
"మిజోరం పోలీసులు తొలుత బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆటోమేటిక్ ఆయుధాలు, లైట్ మెషీన్ గన్నులను (ఎల్‌ఎంజీ) ఉపయోగించి ఎత్తైన ప్రాంతాల నుంచి కాల్పులు జరిపారు. కాల్పులు మొదలవగానే మేం భయంతో పరుగులు పెట్టాం" అని స్థానిక పాత్రికేయుడు ఒకరు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో అక్కడున్న అయిదుగురు పాత్రికేయుల్లో ఆయన ఒకరు. ఈ ప్రాంతంలో అస్సాం వైపు లైలాపుర్ అనే చిన్న పట్టణం ఉండగా, మిజోరం వైపు వైరెంగ్టె ఉంది. తీవ్రవాద నిరోధక, అటవీ సంగ్రామ పాఠశాల వైరెంగ్టేలో ఉండడం విశేషం. ఇక్కడి నుంచి లుషాయ్ పర్వతాల ఎగువకు రహదారి మొదలవుతుంది. భౌగోళికంగా చూస్తే అస్సాం వైపు సరిహద్దు మిజోరం వైపు సరిహద్దు కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ కారణంగానే అస్సాం పోలీసులను తూటాలు బలిగొన్నాయన్న వాదనా ఉంది.