అసోం- మిజోరం మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న తరుణంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిజోరంలో పర్యటించవద్దంటూ అసోం ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మిజోరం వెళ్లినవారు, అక్కడ పనిచేస్తున్న అస్సాం వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అసోం హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.
రెచ్చగొట్టే ప్రకటనలు..
అసోం, మిజోరం సరిహద్దు ప్రాంతాల్లో అనేక హింసాత్మక ఘర్షణలు జరిగాయని, మిజోరంలోని పౌరసమాజానికి చెందిన కొంతమంది సభ్యులు, విద్యార్థులు, యువజన సంస్థలు అసోం మీద, అసోంవాసుల మీద రెచ్చగొట్టే ప్రకటనలు జారీ చేస్తున్నారని ప్రకటనో పేర్కొంది. సరిహద్దుల వద్ద ఆయుధాలతో పలువురు మిజోరం వాసులు ఉన్న విషయాన్ని అసోం పోలీసుల వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో.. గుర్తించినట్లు తెలిపింది .
ఈ నేపథ్యంలో మిజోరం వెళ్లవద్దంటూ తమ రాష్ట్ర వాసులకు సూచించిన అసోం ప్రభుత్వం.. తమ పౌరుల వ్యక్తిగత భద్రతకు తలెత్తే ఎలాంటి ముప్పును అంగీకరించబోమని స్పష్టం చేసింది. రాష్ట్రాలు ఈ తరహా ప్రకటన జారీ చేయటం ఇదే తొలిసారి.