Assam-Arunachal border Firing:ఈశాన్య భారత్‌లో సరిహద్దు వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఈ ఘటనలపై ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాజాగా మరోమరు అసోం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే క్రమంలో తలెత్తిన వివాదంలో కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఏం జరిగింది?
అసోం, ధెమాజీ జిల్లా గోగాముఖ్ ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో వివాదస్పద భూభాగంలో రోడ్డు నిర్మాణం చేపట్టగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు కాంట్రాక్టర్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.
గోగాముఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ బస్తీలోని వివాదాస్పద భూభాగంలో రోడ్డు నిర్మాణం చేపట్టగా.. బుధవారం సాయంత్రం కాల్పులు జరిగాయని అసోం సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
'అసోంలోని సరిహద్దు గ్రామాల ప్రజలు రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకించారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతానికి గ్రామస్థులు రాగా.. కాంట్రాక్టర్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆగ్రహానికి గురైన కొందరు పనులను అడ్డుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లకు నిప్పు పెట్టారు. సమాచారం అందిన వెంటనే అసోం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. నిశితంగా పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.'