Article 370 Supreme Court Reserves Verdict :జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై 16 రోజుల పాటు వాదనలు ( Article 370 Hearing Today ) ఆలకించింది. అన్ని పక్షాలు తమ వాదనలు తెలియజేసిన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సీనియర్ అడ్వొకేట్లు హరీశ్ సాల్వే, రాకేశ్ ద్వివేది, వీ గిరి.. ఆర్టికల్ 370కి మద్దతుగా వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణియం, రాజీవ్ ధావన్, జాఫర్ షా, దుష్యంత్ దవే సైతం కోర్టు ముందు వాదించారు. ఈ వాదనలు పూర్తైన నేపథ్యంలో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. లిఖితపూర్వక సమర్పణలకు వాదప్రతివాదులకు మూడు రోజుల సమయం ఇచ్చింది. అఫిడవిట్లు రెండు పేజీలకు మించకుండా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Article 370 Of Indian Constitution :2019 ఆగస్టు 5న రాజ్యాంగంలోని 370వ అధికరణను కేంద్రం రద్దు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తీసుకొచ్చిన జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్టం చెల్లుబాటును సైతం ప్రశ్నించారు.