Assam Floods: భారీ వర్షాలు, వరదలతో... అసోం అతలాకుతలమౌతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 20 జిల్లాలు జల దిగ్భందంలో చిక్కున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల దిమా హసావో జిల్లాలో రాకపోకలు నిలిచిపోయి సంబంధాలను కోల్పోయింది. అంతకుముందు ముగ్గురు మరణించగా.. తాజాగా మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,97,248 మంది వరద ప్రభావితులు ఉండగా.. హొజాయ్ జిల్లాలో 78,157 మంది, కచ్చార్ జిల్లాలో 51,357 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు అసోం విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అసోం వ్యాప్తంగా 652 గ్రామాలు, 46 రెవెన్యూ సర్కిళ్లు వరద గుప్పెట్లో చిక్కుకున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది.20 జిల్లాల్లో సమారు 2 లక్షల మంది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఏడు జిల్లాలో 55 వరద సహాయ కేంద్రాలను ప్రారంభించగా.. 32,959 మంది ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపింది. ప్రభావిత జిల్లాలో మరో 12 సహాయ కేంద్రాలు తెరుస్తామని పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.