ఆర్మీలో ఉద్యోగం.. లక్షల్లో సంపాదన... ఇవన్నీ ఆయనకు వద్దనుకున్నారు. మారుతున్న వాతావరణంతో పాటు మన మనుగడకు ముప్పుగా ఉన్న కాలుష్యాన్ని నిర్మూలించేందుకు తనవంతు కృషి చేయాలనుకున్నారు. అలా ప్రజలకు పర్యావరణం గురించి అవగాహన కల్పిచేందుకు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను ప్రారంభించారు. 12 జ్యోతిర్లింగాలతో పాటు ఛారదామ్ను సందర్శించేందుకు నడుం బిగించిన ఆయన... ఇప్పటికే నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించారు.
పర్యావరణం కోసం సైకిల్ ఎక్కిన ఆర్మీ మ్యాన్.. ఏకంగా 18వేల కి.మీ. ప్రయాణం! - uttarpradesh latest news
ఆయనో ఆర్మీ మ్యాన్.. ఉద్యోగం విషయంలో ఎలాంటి సమస్యా లేదు.. కానీ మనసులో ఏదో లోటు ఉండేది... కళ్ల ముందు ప్రకృతికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించలేని ఆ వ్యక్తి పర్యావరణహితం కోసం తన ఉద్యోగాన్ని వదిలి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఇప్పటికే వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 'చంకీ రాహీ'... సెప్టెంబర్ 12న తన సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా 4వేల కిలోమీటర్లు పూర్తి చేసిన ఆయన సోమవారం ఝార్ఖండ్‌లోని కోడెర్మాకు చేరుకున్నారు. అక్కడి నుంచి దేవ్‌ఘర్ బాబా ధామ్‌కు పయనమైన చంకీ... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడక నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. దిల్లీలో ఉన్న సమయంలో తనకీ ఆలోచన వచ్చిందని అందుకే ఉద్యోగం మానేసి పర్యావరణ పరిరక్షణ ప్రచారానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. ప్రభుత్వం ప్లాస్టిక్‌పై నిషేధం విధించినప్పటికీ వాటి వినియోగాన్ని ఆపేందుకు సామాన్యులు ముందుకు రావాలన్నారు.-
ఇప్పటికే రెండు నెలలకు పైగా ప్రయాణించిన ఆయన.. ఏప్రిల్‌లోగా చార్ ధామ్ క్షేత్రాలతో పాటు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణ అసమతుల్యత ఇప్పుడు మనముందర ఉన్న పెద్ద సమస్య అని.. దీన్ని నియంత్రించాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉందని చంకీ చెబుతున్నారు. అందుకోసం మొక్కలు నాటడమే కాకుండా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరో 14వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు చురుకుగా ముందుకు కదులుతున్నారు.