Sonia Gandhi fire on BJP: భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. అసహనం, ద్వేషం, మతోన్మాదం దేశాన్ని చుట్టుమడుతున్నాయని మండిపడ్డారు. వీటిని వెంటనే ఆపకపోతే.. పునర్నిర్మించలేని స్థితికి సమాజం దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఇలాంటి పరిస్థితులు కొనసాగేందుకు అనుమతించకూడదని ఓ న్యూస్పేపర్ సంపాదకీయంలో పేర్కొన్నారు.
Sonia Gandhi newspaper article: 'ద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యం దేశాన్ని చుట్టుముడుతున్నాయి. వీటిని ఇలాగే కొనసాగనివ్వకూడదు. దేశ ప్రజలుగా మనం వీటిని చూస్తూ ఉండిపోకూడదు. నకిలీ జాతీయవాదం కోసం మన దేశంలోని శాంతి, బహుళత్వాన్ని త్యాగం చేయకూడదు. గడిచిన తరాలలో నిర్మించినవన్నీ నేలకూలే ముందే ఈ విద్వేషపు సునామీని అడ్డుకోవాలి. దేశంలో విభజన ఇలా శాశ్వతంగా ఉండిపోవాల్సిందేనా? ఇలాంటి పరిణామాలే తమకు మేలు చేస్తాయని ప్రజలు భావించాలని ప్రస్తుత ప్రభుత్వం కోరుకుంటోంది.'
Sonia Gandhi on Hijab row:కర్ణాటకలో హిజాబ్ వివాదం, రామనవమి సందర్భంగా దేశంలో ఘర్షణలు, జేఎన్యూలో మాంసాహారంపై గొడవ వంటి అంశాలనూ తన ఆర్టికల్లో పరోక్షంగా ప్రస్తావించారు సోనియా. 'దుస్తులు, ఆహారం, విశ్వాసాలు, పండగలు, భాష.. ఇలా ఏ అంశమైనా దేశంలోని పౌరులను తమ తోటి పౌరులకు వ్యతిరేకంగా మారుస్తున్నారు. అసమ్మతి శక్తులకు ప్రోత్సాహం లభిస్తోంది. విలువైన వనరులను దేశ భవిష్యత్ కోసం, యువతను అభివృద్ధి చేయడం కోసం ఉపయోగించడం మాని.. గతంలో జరిగిన సంఘటనలకు ఊహాగానాలు జోడించి ప్రస్తుత పరిణామాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు' అని సోనియా పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నవారికి అనుకూలమైన భావజాలం లేకపోతే.. అణచివేస్తున్నారని సోనియా ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని.. దేశ యంత్రాంగాన్ని వారిపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. 'సామాజిక కార్యకర్తలను బెదిరించి నోరుమూయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలను విష ప్రచారం చేస్తున్నారు. కనిష్ఠ ప్రభుత్వం గరిష్ఠ పాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వానికి 'భయం, మోసం, బెదిరింపు'లే మూలస్తంభాలుగా మారిపోయాయి' అని సోనియా వ్యాఖ్యానించారు.