మంత్రి బొత్సను ఆడుకున్న తెలంగాణ మంత్రులు AP Minister Botsa Satyanarayana Controversial Comments: ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చడం సరికాదని.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణలో అంతా చూచిరాతలు, కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు. విద్యకు సంబంధించిన అంశాలతోపాటు ఉపాధ్యాయ బదిలీలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"తెలంగాణలో ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. టీఎస్పీఎస్సీ పరీక్షలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. చూసి రాతలు రాసి, స్కాములు జరిగి, ఎంత మంది అరెస్టు అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాము. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా వాళ్లు చేసుకోలేని పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఒక రాష్ట్రంలో పోల్చకండి. ఎవరి విధానం వారిది". - బొత్స సత్యనారాయణ, ఏపీ విద్యాశాఖ మంత్రి
విద్యావ్యవస్థపై బొత్స వ్యాఖ్యలను తెలంగాణ మంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్యలో దేశంలోనే నెంబర్-1గా ఉన్న తమ రాష్ట్రాన్ని కించపరచడం దారుణమని... తెలంగాణను మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పారదర్శకంగా పని చేస్తుండటం వల్లే ఉద్యోగ నియామక పరీక్షల్లో లీకేజీలు చేసిన వారిని పట్టుకుని జైలుకు పంపామన్నారు. బొత్స వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"తెలంగాణ మీద ఇంకా విషం చిమ్ముతున్నారు. విద్యావ్యవస్థ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఈ భారతదేశంలో అత్యుత్తమ విద్యను అందించే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కువ గురుకులాలు పెట్టింది తెలంగాణ రాష్ట్రం. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీకు కూడా గురుకులాలు పెట్టినాము. బొత్స సత్యనారాయణ నువ్వు వినాలి ఇప్పుడు... మా దగ్గర 1019 గురుకులాలు ఉంటే.. మరి మీ దగ్గర 308 గురుకులాలు ఉన్నాయి. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు జరిగింది కాబట్టే మేమే దొంగలను పట్టుకున్నాం. అరెస్టు చేపించాం. మాకు చిత్తశుద్ధి ఉంది. ఏపీలో ఉద్యోగాలను అమ్ముకున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు 5 లక్షల రూపాయలకు చేస్తున్నారు. ఏపీలో కరెంటు లేదు. నీళ్లు లేవు. పంటలు లేవు." - గంగుల కమలాకర్, తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి
ఫోక్స్‌వ్యాగన్ కుంభకోణంలో ఇరుక్కున్న బొత్స, స్కామ్‌ల గురించి మాట్లాడటం విడ్డూరమని... తెలంగాణకు చెందిన మరో మంత్రి శ్రీనివాసగౌడ్ ఎద్దేవా చేశారు. వ్యవసాయం, విద్యుత్, విద్య, రోడ్లు సహా ఏ రంగంలో తెలంగాణ కంటే ఆంధ్ర ముందుందో చర్చకు బొత్స సిద్ధమా అని ప్రశ్నించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప, రెచ్చగొట్టే మాటలతో సమయం వృథా చేసుకోవద్దని... బొత్స సత్యనారాయణకు తెలంగాణ మంత్రులు సూచించారు.
"అభివృద్ధిని చూసి ఓర్వలేక.. మాట్లాడిన మాటలు అవి. మా పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని అడిగితే.. చెప్పలేని పరిస్థితి ఉంది. ముందు మీరు.. మీ రోడ్లు చూసుకోండి.. మీ రాజధాని చూసుకోండి.. ఓడ రేవులను అభివృద్ధి చేయండి. అంతేకాని మా మీద ఎందుకు విషంకక్కుడు. మా దగ్గర వోక్స్ వ్యాగన్ స్కాములు ఉన్నాయా?. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల వద్ద కూడా వివక్ష ఉంది. " - శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ మంత్రి