దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కేసు, మన్సుఖ్ హిరేన్ మృతి కేసుల్లో ఎన్ఐఏ దర్యాప్తు కార్ల చుట్టూ తిరుగుతోంది. ముంబయిలోని అంబానీ నివాసం వద్ద కలకలం రేపిన స్కార్పియోతో మొదలు ఇటీవల ఔట్‌ల్యాండర్ వరకు ఈ కేసులో ఇప్పటివరకు 7 కార్లు స్వాధీనం చేసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ. వీటిలో కొన్ని వాహనాలకు ముంబయి నగర పోలీస్ కమిషనరేట్‌తో సంబంధం ఉన్నట్లు తేలగా... మున్ముందు ఈ దర్యాప్తు ఎలా సాగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీజ్ చేసిన కార్లలో మెర్సిడిస్, వోల్వో వంటి విలావంతమైన కార్లు ఉండటం గమనార్హం. వీటిని మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్ వాజే ఉపయోగించారని తొలుత దర్యాప్తు చేపట్టిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వెల్లడించింది. ఇన్నోవా, స్కార్పియో, 1 మెర్సిడిస్, ప్రాడో సహా ఔట్ ల్యాండర్ కార్లనూ వాజే వాడారని తెలిసింది.
వాజే కార్లు..
వాజే ఉయోగించిన కార్లలో ఎన్ఐఏ మొదట స్వాధీనం చేసుకున్నది ఇన్నోవా. ఘటన జరిగిన రోజు ఆ ప్రాంతంలో వాజే ఈ కారులో అంబానీ నివాసం మీదుగా ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారు క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్ చెందినదని దర్యాప్తులో తెలిసింది.
అంబానీ నివాసం వద్ద కలకలం రేపిన స్కార్పియో కూడా నాలుగు రోజుల ముందు పోలీస్ కమిషనర్ కార్యాలయం వెలుపల పార్క్ చేసి ఉందని దర్యాప్తులో వెల్లడైంది.