నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనకు పరిష్కారం కనుగొనే మార్గాలను కొన్ని దేశ, సామాజిక వ్యతిరేక శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆరోపించింది. ఇలాంటి శక్తులు.. తమ రాజకీయ ఆశయాలను నెరవేర్చుకునేందుకు దేశంలో అవాంతరాలు సృష్టిస్తాయని ధ్వజమెత్తింది.
అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఏబీపీఎస్) నిర్వహించిన రెండు రోజుల సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది ఆర్ఎస్ఎస్. నిరసనల్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు ఎవరికీ ఆసక్తి లేదని తెలిపింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా.. రైతులు, కేంద్రంతో తప్పనిసరిగా చర్చలు జరపాలన్న సంఘ్.. ఇరువురూ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది. లేదంటే అనేకమంది రోజువారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తన నివేదికలో పేర్కొంది.