Dogs Attack on Girl Baby: ఆ చిన్నారికి 18 నెలలు. తల్లి పాలు తాగి తన బోసి నవ్వులతో మంచంపై ఆడుకుంటోంది. కూతురు ఆడుకుంటుంది కదా అని పని చేసుకోవడానికి ఆ తల్లి బయటికి వెళ్లింది. అదే ఆమెకు తన బిడ్డను దూరం చేస్తుందని తెలుసుకోలేకపోయింది. వీధికుక్కలు అత్యంత దారుణంగా పక్కనే ఉన్న తోటలో ఈడ్చుకెళ్లాయి. పాప కనిపించడంలేదని వెతుకుతున్న తల్లిదండ్రులకు కుక్కల మధ్యన బిక్కుబిక్కుమంటూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కూతురు కనిపించగానే వాళ్లు పడ్డ రోదన అంతాఇంతా కాదు. పాపని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమై చిన్నారి శాశ్వతంగా దూరమైంది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
Dogs Attack: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. కుక్కల దాడిలో చిన్నారి మృతి
22:22 April 21
ప్రథమ చికిత్స అందిస్తున్న లోపే మృతి
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసకు చెందిన.. రాంబాబు, రామలక్ష్మి దంపతుల రెండో కుమార్తే సాత్విక.! శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో పాప మంచంపై.. ఆడుకుంటోంది. తల్లిదండ్రులు వారివారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో.. వీధి కుక్కలు పాపపై పాశవిక దాడి చేశాయి. పదునెక్కిన పళ్లతో పట్టుకుని.. పక్కనే ఉన్న తోటలోకి ఈడ్చుకెళ్లాయి. ఇదంతా తల్లిదండ్రులు గమనించలేకపోయారు. కాసేపటికి మంచంపై చిన్నారి అలికిడి లేకపోవడంతో.. గాబరాపడ్డారు. సాత్విక అటేమైనా వచ్చిందా అంటూ ఇరుగుపొరుగును ఆరాతీశారు. ఎవరూ చూడలేదని చెప్పడంతో.. అంతా వెతికారు. చివరకు ఇంటి సమీపంలోని తోటలో.. కుక్కలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్లు గుర్తించారు. పరిగెత్తుకుంటూ వెళ్లి... కుక్కలను తరిమారు. చిట్టితల్లికి.. ఏమైందోనని గుండెలకు హత్తుకున్నారు. కానీ ఉలుకుపలుకు లేదు. తరచిచూస్తే పాప ఒళ్లంతా.. కుక్కగాట్లే. సాత్వికా, సాత్వికా అంటూ... తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. హుటాహుటిన రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాపను బతికించేందుకు.. విశ్వప్రయత్నాలు చేసిన వైద్యులు.. ఊపిరి ఆగిపోయినట్లు ప్రకటించారు.
ఊళ్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని.. గ్రామస్థులు వాపోతున్నారు. పెద్దలనూ కరిచేందుకు వెంటపడుతున్నాయని.. సర్పంచ్ చెప్పారు. ముద్దు ముద్దుమాటలు, అల్లరి చేష్టలతో సందడి చేసే సాత్విక.. నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి.. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇవీ చదవండి: