Amul Turnover 2023 :డెయిరీ దిగ్గజ సంస్థ అమూల్.. దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) బ్రాండ్‌గా అవతరించింది. రూ.72వేల కోట్ల రికార్డు టర్నోవర్‌ను సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీ అయిన అమూల్.. 2022-23లో రూ.11,000 కోట్లు ఆర్జించింది.
గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) యాజమాన్యంలోని అమూల్.. 49వ AGM(వార్షిక సర్వసభ్య సమావేశం).. శనివారం గుజరాత్లో జరిగింది. అమూల్ మార్కెటింగ్ బాడీ.. ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. 1973లో కేవలం ఆరుగురు సభ్యులు.. రూ.121 కోట్ల టర్నోవర్‌తో ప్రారంభమైన GCMMF ప్రస్తుతం రాష్ట్రంలో 18 సభ్య సంఘాలను కలిగి ఉంది. మూడు కోట్ల లీటర్ల పాలను సేకరిస్తోంది.
'మూడేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్!'
GCMMF Turnover : జీసీఎంఎంఎఫ్ అధ్యక్షుడు శమల్భాయ్ పటేల్.. 2022-23లో తమ సంస్థ 18.5 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. "గత 50 సంవత్సరాలుగా పాడి పరిశ్రమ, రైతులు, వినియోగదారుల మధ్య వారధిగా ఉండాలనే సూత్రాన్ని పాటించి మేం విజయం సాధించాం. త్రిభువన్దాస్ పటేల్, మోతీభాయ్ చౌదరి, గల్బాభాయ్ పటేల్, భురాభాయ్ పటేల్, జగ్జీవన్‌దాస్ పటేల్, జస్వంత్‌లాల్‌ల స్ఫూర్తితో సంస్థ స్థాపించాం. వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో రూ.లక్ష కోట్ల టర్నోవర్ సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం" అని శమల్భాయ్ పటేల్ తెలిపారు.