Common civil code: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలుపై మధ్యప్రదేశ్ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాతి నుంచి భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక పుష్కర్ సింగ్ ధామీ.. ఈ అంశాన్ని మొదటగా లెవనెత్తారు. ఆ తర్వాత కమలం పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో చర్చిస్తామని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించారు.
Amit Shah On Uniform Civil Code: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై చర్చ జోరందుకుంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాజ్వాదీ ప్రోగ్రెసివ్ పార్టీ అధినేత శివపాల్ యాదవ్.. యూసీసీని కచ్చితంగా అమలు చేయాలన్నారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
Common civil code implementation: భాజపా పాలిత గోవాలో మాత్రమే ప్రస్తుతం యూసీసీ అమల్లో ఉంది. 1961కి ముందు నుంచే పోర్చుగీస్ వారు పాలించే సమయంలోనే దీన్ని గోవాలో అమల్లోకి తెచ్చారు. యూసీసీ అమల్లోకి వస్తే అన్ని మతాలకు ఒకే నిబంధన వర్తించేలా కొత్త చట్టం వస్తుంది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత ఇలా అన్ని విషయాల్లో మతాలకు అతీతంగా అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో యూనిఫాం సివిల్ కోడ్ ప్రస్తావన ఉంటుంది. అయితే యూసీసీ గురించి భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే ప్రస్తావించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా? లేక 2024 సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధతను ఇది సూచిస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.