Ambani family threatened: భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని 3 గంటల్లో చంపేస్తామని సోమవారం ఉదయం ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్‌కు ఈ కాల్ వచ్చినట్లు చెప్పారు. ఏకంగా ఎనిమిది సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్స్, వరుసగా ఎనిమిది సార్లు - ముకేశ్ అంబానీకి బెదిరింపులు
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి ఎనిమిది సార్లు ఓ ఆగంతుకుడు కాల్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
బెదిరింపు కాల్స్‌పై ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. వెంటనే అంబానీ నివాసానికి పెద్ద సంఖ్యలో సిబ్బందిని పంపారు. ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ముంబయి దహిసర్‌లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఆయన నివాసం అంటిలియా వద్ద పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోకనిపించడం కలకలం రేపింది. కొందరు దుండగులు జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమైంది.