కరోనా కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమర్‌నాథ్ యాత్ర నిర్వహించటం లేదు. జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు 56 రోజుల పాటు ఈ యాత్ర జరగవలసి ఉండగా, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దు చేశారు.
అయితే అమర్‌నాథ్ గుహలో మాత్రం లాంఛనంగా అర్చనలు జరుగుతాయని జమ్మూ- కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, దేవస్థానం బోర్డు ఛైర్మన్ అయిన మనోజ్ సిన్హా సోమవారం తెలిపారు. సంప్రదాయం ప్రకారం అన్ని పూజలూ చేస్తారని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు, సాయంత్రం అయిదు గంటలకు ఇచ్చే హారతిని అరగంట పాటు యాప్‌లు, ఆలయ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని చెప్పారు. ఈ రూపంలో భక్తులు దైవ దర్శనాన్ని చేసుకోవాలని కోరారు.