శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీ మొత్తం ఐక్యంగా ఉందనే సంకేతాలిచ్చింది పంజాబ్ కాంగ్రెస్. నవజోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ సింగ్ మధ్య వర్గపోరుకు తెరపడిందనే సుస్పష్టమైన సంకేతాలు ఇస్తూ.. ఐక్యతా రాగం ఆలపించింది. పీసీసీ అధ్యక్షుడికి సిద్ధూ ప్రమాణస్వీకారోత్సవం ఇందుకు వేదికైంది.
తేనీటి విందులో సిద్ధూ, అమరీందర్ సింగ్ పీసీసీ సారథిగా కొద్దిరోజుల క్రితం నియమితులైన సిద్ధూ.. శుక్రవారం చంఢీగఢ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సహా పార్టీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరై, సిద్ధూను అభినందించారు.
ఒక్కసారిగా మార్పు
కొత్త పీసీసీ సారథి నియామకం తర్వాత సిద్ధూ, అమరీందర్ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. అమరీందర్.. సిద్దూను కనీసం అభినందించలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గతంలో చేసిన ట్వీట్లపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి క్షమాపణ చెబితే గానీ.. సిద్ధూను కలిసేది లేదని అమరీందర్ నిర్ణయించుకున్నట్లు వెల్లడించాయి.
బుధవారం కూడా సిద్ధూ, అమరీందర్ పోటాపోటీగా ప్రజాప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. అనూహ్యంగా గురువారం సిద్ధూ రాసిన లేఖతో పరిస్థితి తారుమారైంది. ప్రమాణ స్వీకారానికి రావాలని సిద్ధూ ఆహ్వానించగా.. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్లో వర్గపోరుకు తెర- ఒకే వేదికపై ఆ ఇద్దరు!