అఖిల భారత సర్వీసుల్లోని అధికారులు.. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు ప్రచారానికి వీలైనంత దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం కష్టమైనా సరే అధిగమిస్తూ విధి నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో భాగంగా చేసే పని ప్రచారం కోసమే జరిగిందా..? అని నిత్యం సమీక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న 72వ బ్యాచ్ యువ ఐపీఎస్ అధికారులతో గురువారం దిల్లీ నుంచి దృశ్యమాధ్యమంలో మాట్లాడారు.
'ప్రచారానికి దూరంగా పనిచేయాలి' - అమిత్ షా తాజా సమాచారం
ఐపీఎస్ అధికారులు ప్రచారానికి వీలైనంత దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం కష్టమైనా సరే అధిగమిస్తూ విధి నిర్వహణపై దృష్టి సారించాలన్నారు.
"పోలీసుల దర్యాప్తులో శాస్త్రీయ పరిశోధనల పాత్ర గణనీయంగా పెరగబోతోంది. వాటిని పెంచడం ద్వారా తక్కువ మానవ వనరుల్ని ఉపయోగించేలా దృష్టి సారించాలి. ఈ దిశగానే నేషనల్ రక్ష శక్తి యూనివర్సిటీ, నేషనల్ ఫొరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలు ఏర్పాటుచేశాం. దర్యాప్తులో నాణ్యతను పెంచడమే వీటి ఉద్దేశం. సైబర్ నేరాల్ని అరికట్టడంలో భాగంగా 4 సంస్థలను ఏర్పాటు చేశాం. ఆర్థిక సంబంధ, మాదకద్రవ్యాల నేరాల నిరోధానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా యంత్రాంగానికి తగిన శిక్షణ ఇచ్చినప్పుడే వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చనేది ప్రధాని మోదీ ఆలోచన. ప్రజలతో సరైన సంబంధాలు లేకుండా నేర సమాచారాన్ని సేకరించడం కష్టం. ఎస్పీ, డీఎస్పీ స్థాయిలోని అధికారులు గ్రామాల్లో బస చేసి ప్రజలతో మమేకం కావాలి. శిక్షణ పొందుతున్న అధికారుల భుజస్కంధాలపై చట్టపరమైన బాధ్యతలు మోపుతున్నాం. దీన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని సమన్యాయం జరిగేలా చూడాలి. పోలీస్ శాఖలో 85 శాతం కీలక బాధ్యతలు మోస్తున్న కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ అధికారులదే కీలక పాత్ర. ఈ విషయాన్ని గుర్తించి సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలి. పోలీస్ శాఖలో అప్రాధాన్య పోస్టులంటూ ఏవీ ఉండవు. దేని ప్రాముఖ్యత దానిదే. ప్రధాని మీపై పెట్టుకున్న అంచనాల్ని అధిగమించాలి" అని అమిత్ షా అన్నారు.
ఇదీ చూడండి:మోదీకి మామిడి పండ్లు పంపిన సీఎం