Alimony to working wife: తన భార్యకు భరణం చెల్సించాల్సిన అవసరం లేదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై కీలక తీర్పు వెలువరించింది బొంబాయి హైకోర్టు. విడాకులు తీసుకున్న భార్య ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పటికీ ఆమె భరణం పొందే హక్కును కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఉద్యోగం చేసినప్పటికీ భరణానికి అర్హురాలేనని తేల్చింది. ఈ తీర్పు ఉద్యోగం చేస్తూ విడాకులు తీసుకున్న చాలా మంది మహిళలకు ఉపశమనమని పలువురు పేర్కొంటున్నారు.
ఇదీ జరిగింది:మహారాష్ట్రలోని కొల్హాపుర్కు చెందిన పిటిషనర్లకు 13 ఏళ్ల క్రితం 2005, మేలో వివాహం జరిగింది. వారికి 2012లో ఓ కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భర్త, అత్తింటివారిపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది భార్య. 2015లో విడాకులు తీసుకున్నారు. వారి పదేళ్ల కుమారుడు భార్యతోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 2015, జులైలో కుమారుడికి నెలకు రూ.2వేలు ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించారు. తన కుమారుడితో పాటు తనకూ భరణం ఇవ్వాలని భార్య సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు 2021, మార్చిలో నెలకు రూ.5వేలు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది.
సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బొంబాయి హైకోర్టులో పిటషన్ దాఖలు చేశారు భర్త. తన భార్య ఉద్యోగం చేస్తోందని, రోజుకు రూ.150 వరకు సంపాదిస్తోందని, అందువల్ల ప్రత్యేకంగా భరణం చెల్లించాల్సిన అవసరం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టారు జస్టిస్ ఎన్జే జమదార్. రోజువారీ జీవనానికి కావాల్సిన సొమ్మును భార్య సంపాదిస్తున్నప్పుడు భరణం అవసరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విడాకులు తీసుకున్న మహిళ సంపాదిస్తూ తనను తాను చూసుకోగల స్థితిలోనే ఉందని.. సెషన్స్ కోర్టు తప్పుగా తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. అయితే, ఆ వాదనలను తోసిపుచ్చారు న్యాయమూర్తి.