రైతుల ఆందోళనపై విదేశీ ప్రముఖులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ సహా ఇతర తారలు పిలుపునిచ్చారు. పాప్ సింగర్ రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన నేపథ్యంలో వీరు స్పందించారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. భారత్‌పై దుష్ప్రచారం చేసి, విభేదాలు సృష్టించాలని చూసే వారి గురించి పట్టించుకోవద్దని అభిమానులను కోరారు.
రిహానా, గ్రెటా ట్వీట్లపై భారత విదేశీ వ్యవహార శాఖ ఘాటుగా స్పందించిన కాసేపటికే బాలీవుడ్ తారలు ఈ విషయంపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
" రైతులు మన దేశంలో చాలా ముఖ్యమైన భాగం. వారి సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మనమంతా మద్దతు తెలుపుదాం. విభేదాలు సృష్టించాలని చూసే వారిని అసలు పట్టించుకోవద్దు. #IndiaAgainstPropaganda"
- అక్షయ్ కుమార్ ట్వీట్.
ఈ ట్వీట్‌కు విదేశీ వ్యవహారాల శాఖ స్పందనను జత చేశారు అక్షయ్.
భారత్‌కు వ్యతిరేకంగా చేసే ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని అజయ్ దేవ్‌గణ్ విజ్ఞప్తి చేశారు.
" భారత్‌పై గానీ, భారత విధానాలపై గానీ చేసే దుష్ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు. ఇలాంటి సమయంలో ఎలాంటి అంతర్గత సంఘర్షణలు లేకుండా ఐక్యంగా ఉండటం చాలా ముఖ్యం. #IndiaTogether #IndiaAgainstPropaganda "
-అజయ్ దేవగణ్ ట్వీట్
బాలీవుడ్ దర్శకుడు, నటుడు కరణ్ జోహార్ కూడా ఈ విషయంపై స్పందించారు.
అల్లకల్లోలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులో ప్రతి సందర్భంలోనూ వివేకం, సహనం అవసరం. ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేయాలి. రైతులు దేశానికి వెన్నెముక. దేశంలో విభజన సృష్టించేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వొద్దు.
-కరణ్ జోహార్ ట్వీట్.
బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి, కైలాశ్ ఖేర్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. అసత్య ప్రచారాన్ని నమ్మడం అత్యంత ప్రమాదకరం అని సునీల్ శెట్టి అన్నారు. భారత్‌ను అపకీర్తిపాలు చేసేందకు జాతి వ్యతిరేక శక్తులు ఎంతటి స్థాయికైనా దిగజారతాయని ఎవరి పేరూ ప్రస్తావించకుండా ఘాటు విమర్శలు చేశారు.
మాస్టర్ బ్లాస్టర్ స్పందన
రైతు నిరసనలపై విదేశీ ప్రముఖులు స్పందించడాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తప్పుబట్టారు. "భారత దేశ సార్వభౌమత్వం విషయంలో ఎలాంటి రాజీ లేదు. బయటి వ్యక్తులు ఇక్కడ ఏం జరుగుతుందో గమనించవచ్చు కానీ భాగస్వాములు కారాదు. భారత దేశం అంటే ఏంటో భారతీయులకు తెలుసు. దేశానికి ఏది మంచిదో వారే నిర్ణయించుకుంటారు. ఒక దేశంగా అందరం ఐక్యంగా ఉందాం" అని అన్నారు సచిన్.
విదేశాంగ శాఖ స్పందన..
అంతకుముందు పాప్ సింగర్ రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ వంటి విదేశీ ప్రముఖులు రైతుల ఆందోళనల విషయంలో చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ నిరసనలను భారత ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ నేపథ్యంలోనే చూడాలని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో సంచలనాత్మక హ్యాష్ ట్యాగ్లు, వ్యాఖ్యల్లో కచ్చితత్వం ఉండదని, బాధ్యతారాహిత్యంగా ఉంటాయని తెలిపింది. అనంతరం కాసేపటికే ఈ విషయంపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు.
ఇదీ చూడండి: 'రైతు పోరుపై నిజాలు తెలుసుకొని మాట్లాడండి'