Akhand Bharat Map In New Parliament : నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. అయితే పార్లమెంట్ భవనంలోని ఓ గోడపై ఉన్న మ్యాప్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాప్.. పురాతన భారతదేశాన్ని సూచించే విధంగా ఉంది. అందులో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న తక్షశిల, మరికొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాప్‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. 'సంకల్పం సుస్పష్టం.. అఖండ భారత్' అంటూ జోషి ట్వీట్ చేశారు.
మరోవైపు.. పార్లమెంట్ భవనంలో అఖండ భారత్ మ్యాప్‌పై కర్ణాటక బీజేపీ కూడా స్పందించింది. 'ఇది మనం గర్వించదగిన గొప్ప నాగరికతకు చిహ్నం' అని తన ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొంది.
'అఖండ భారత్' భావన అనేది ప్రస్తుత అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో కూడిన భౌగోళిక ప్రాంతంతో ఉన్న అవిభక్త భారతదేశాన్ని సూచిస్తుంది. 2019లో కేంద్ర మంత్రి అమిత్ షా 'అఖండ భారత్'పై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అఖండ భారత్ గురించి ఆయన ప్రస్తావించారు. 'మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు మాత్రమే అయ్యింది. అంతకుముందు ప్రభుత్వాలు తమ పాలనలో చేయని పనిని మా ప్రభుత్వం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు.. మోదీ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయం. 'అఖండ భారత్' చూడాలనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ కల. అయితే ఇంతవరకు ఆర్టికల్ 370 దానికి అడ్డంకిగా ఉంది' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
గ్రాండ్‌గా ఓపెనింగ్..
Narendra Modi New Parliament : కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. తొలుత స్పీకర్ ఓం బిర్లాతో కలిసి మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం నూతన పార్లమెంట్ వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత చారిత్రక రాజదండం 'సెంగోల్'కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. సెంగోల్‌ను వేద మంత్రోచ్ఛారణల మధ్య లోక్‌సభ ఛాంబర్లోని స్పీకర్ కుర్చీకి కుడివైపున ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో ప్రతిష్ఠించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు..
New Parliament Building Features : 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. త్రికోణాకారంలో కట్టిన ఈ భవనంలో నాలుగంతస్తులు ఉన్నాయి. ఒకేసారి 1,272 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా దీన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ కొత్త భవనంలో కాన్‌స్టిట్యూషన్ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, గ్రంథాలయం, కమిటీ హాళ్లు, విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మలుగా నామకరణం చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.