Union Cabinet Reshuffle India : కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందన్న.. వార్తలు వస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. పార్టీ నేతలతో బుధవారం అర్ధరాత్రి కీలక భేటీ నిర్వహించారు. బీజేపీ పెద్దలు, సీనియర్ నేతలతో ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దాదాపు ఐదు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రి వర్గంలోనూ భారీ మార్పులకు ఈ భేటీలో చర్చ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
మోదీ, అమిత్ షా మాస్టర్‌ప్లాన్.. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు! - మోదీ అమిత్ షా సమావేశం వార్తలు
Union Cabinet Reshuffle 2023 : కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు, కేంద్రమంత్రులతో.. ప్రధాని మోదీ బుధవారం అర్ధరాత్రి కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ చర్య.. కీలక పరిణామమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Modi Cabinet Reshuffle 2023 : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. ఇటీవల రాష్ట్రాల వారీగా నేతలతో సమావేశాలు జరిపారు. లోక్‌సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర స్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. తాజా సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే రాష్ట్ర స్థాయుల్లో బీజేపీ అధ్యక్షుల్లో మార్పులు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండొచ్చని సమాచారం. ఎన్నికలకు ముందు వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించి కొత్తవారిని మంత్రివర్గంలోకితీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీ, అందులో చర్చించిన అంశాలపై భాజపా నేతలు ఇంతవరకూ స్పందించలేదు.
General Election 2024 : ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. మరోవైపు, ఈ ఏడాది చివరల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నాలుగింట్లో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ దక్కించుకోవాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. క్షేత్ర స్థాయిలో మరింత మద్దతు కూడగట్టుకునేందుకు.. గత నెల కేంద్ర మంత్రులు, పలువురు సీనియర్ నేతలు ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనను పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.