తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అగ్నిపథ్​'పై ఆగని నిరసనల హోరు.. పలు చోట్ల రైళ్లకు నిప్పు

Agnipath Protests: సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలోనే నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. బిహార్, యూపీలలో పలుచోట్ల ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు.

protest against agneepath
'అగ్నిపథ్​'పై మూడో రోజూ నిరసనలు

By

Published : Jun 17, 2022, 10:06 AM IST

Updated : Jun 17, 2022, 11:56 AM IST

'అగ్నిపథ్​'పై ఆగని నిరసనల హోరు

Agnipath Protests: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలురాష్ట్రాలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారత్‌ మాతాకీ జై , అగ్నిపథ్ వెనక్కి తీసుకోవాలనే నినాదాలు చేస్తూ యువత పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. బిహార్, యూపీల్లో.. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వేస్టేషన్లలోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. బిహార్‌లోని లఖీసరాయ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ రైలుకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఐదు కంపార్ట్‌మెంట్లు కాలిపోయాయి. ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో రైళ్లోని ప్రయాణికులు భయాందోళనలకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వీడియో తీయకుండా ఆందోళనకారులు.. తమ ఫోన్లను లాక్కున్నట్లు స్థానిక పోలీసు సిబ్బంది వెల్లడించారు.

యూపీలోని బాలియా రైల్వే స్టేషన్​లో నిరసనకారులు

బిహార్‌లోని మెహియుద్దీనగర్ స్టేషన్‌లో.. జమ్మూ తావీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లోని రెండు బోగీలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బెగూసరాయ్, బెట్టియా ప్రాంతాల్లోనూ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వేస్టేషన్‌లలోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఆందోళనలతో బిహార్‌లో రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం తలెత్తింది.

బిహార్​లోని లకీసరాయ్​ స్టేషన్​లో రైలుకు నిప్పు

ఉపముఖ్యమంత్రి ఇంటిపై దాడి:బిహార్​, బెట్టియాలోని ఆ రాష్ట్ర ​ ఉప ముఖ్యమంత్రి రేణు దేవికి చెందిన ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. తమ ఇంటిపై దాడి జరిగినట్లు ఆమె కుమారుడు తెలిపారు. ఈ దాడుల్లో భారీగా నష్టపోయామని చెప్పారు. ప్రస్తుతం రేణు దేవి పట్నాలో ఉన్నారని వెల్లడించారు.

దుండగుల దాడిలో ధ్వంసమైన దుకాణం

ఉత్తర్​ప్రదేశ్​లో..యూపీలోని బలియా జిల్లాలో ఓ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. రైలుబోగీలకు.. నిప్పుపెట్టారు. అక్కడున్న పోలీసు సిబ్బందిపైకి రాళ్లు విసిరినట్లు స్థానిక డీఎం సౌమ్య అగర్వాల్ వెల్లడించారు. వీరిలార్క్‌ స్టేడియంలో సమావేశమైన నిరసనకారులు.. అక్కడ నుంచి బలియా రైల్వేస్టేషన్‌కు ర్యాలీగా వచ్చి విధ్వంసం సృష్టించినట్లు.. తెలిపారు. స్టేషన్‌ వెలుపల బస్సులపై సైతం నిరసనకారులు దాడి చేసినట్లు వివరించారు. ఆందోళనల్లో ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని మూడు రైళ్లల్లోని బోగీలు, బిహార్‌లోని కుల్హరియాలో ఓఖాళీ రేక్, యూపీలోని బలియాలో ఓ కోచ్‌ను ధ్వంసమైనట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

యూపీలోని బాలియా రైల్వే స్టేషన్​ ముందు పోలీసుల పహారా

ఏమిటి ఈ అగ్నిపథ్?​:ఈ పథకం ద్వారా.. 17.5 నుంచి 21 ఏళ్లు మధ్య ఉన్న యువకులు త్రివిధ దళాలలో చేరవచ్చు. ఈ ఏడాదికి మాత్రం గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచారు. నాలుగేళ్ల పాటు సేవలు అందించాక వీరిలో 25 శాతం మందికి మాత్రమే సైన్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద సైన్యంలో చేరిన వారిని 'అగ్నివీరులు'గా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46,000 మంది సైనికులను నియమించనున్నట్లు రక్షణ శాఖ గత మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో సైనిక ఉద్యోగార్థులతో పాటు విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అగ్నిపథ్​ పేరిట నిరుద్యోగులకు అగ్నిపరీక్ష పెట్టొద్దని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

ఇదీ చూడండి:'అగ్నిపథ్'​పై ఉద్యోగార్థులు భగ్గు.. రెండు రైళ్లకు నిప్పు.. ఉపసంహరణకు డిమాండ్

సైన్యంలో భారీగా ఉద్యోగాలు.. నాలుగేళ్లు చేశాక రిటైర్మెంట్.. మంచి జీతం, పింఛను!

Last Updated : Jun 17, 2022, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details