Congress News: అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బను కాంగ్రెస్ అధిష్ఠానం ఓ గుణపాఠంగా తీసుకుంది. సత్వర నిర్ణయాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రజా సమస్యలు.. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎప్పటికప్పుడు చక్కబెట్టే పనిలో పడింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేరుగా మార్గనిర్దేశం చేస్తూ క్రియాశీలంగా వ్యవహరిస్తుండడంతో అన్ని స్థాయిల నేతల్లో కదలిక ప్రారంభమైంది. ఎన్నికల అనంతరం అయిదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను మార్చడం, తరచూ విమర్శలు చేస్తున్న జీ 23 నేతలతో సమావేశాలు, సభ్యత్వ నమోదుపై సమీక్షలు అందులో భాగమే.
ఇదంతా ఎందుకంటే:ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపాతో కాంగ్రెస్ ముఖాముఖి తలపడనుంది. పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురల్లోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లపై పార్టీ ఎక్కువగా దృష్టిసారిస్తోంది. సంస్థాగత బలహీనతలే ఓటమికి కారణమని పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది. గురువారంతో ముగియనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల నేతల పనితీరును బేరీజు వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు అయిదు కోట్ల మంది కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు.