Aditya L1 Orbit Raising :సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా సాగుతోంది. దీనికి సంబంధించి రెండో భూ కక్ష్య పెంపు ప్రక్రియను మంగళవారం ఇస్రో చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం.. 282 కిలో మీటర్లు బై 40,225 కిలోమీటర్ల నూతన కక్ష్యలో ప్రవేశించినట్లు తెలిపింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 10 చేపడతామని ఇస్రో సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తెలిపింది. సెప్టెంబర్ 3న భూ కక్ష్య పెంపు తొలి విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ISRO Aditya L1 Mission Launch Date :'ఆదిత్య-ఎల్1' ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం (2023 సెప్టెంబర్ 2) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి మోసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశించింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది 'ఆదిత్య-ఎల్1' వ్యోమనౌక. అనంతరం భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్1 బిందువు (lagrange point 1) దిశగా.. 125 రోజుల ప్రయాణం తర్వాత చేరుకోనుంది.
What Is Aditya L1 Mission :లగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. ఫలితంగా అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేసే వీలు ఉంటుంది. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం ఉంటుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపట్టింది.