యోగా గురు బాబా రామ్‌దేవ్ ప్రమోట్ చేసే పతంజలి రూపొందించిన 'కరోనిల్'ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కరోనా కిట్‌లో చేర్చింది. దీనిపై ఆ రాష్ట్ర 'భారత వైద్య సమాఖ్య(ఐఎంఏ)' విభాగం తీవ్ర స్థాయిలో మండిపడింది. అల్లోపతి ముందులు ఉండే కరోనా కిట్‌లో ఆయుర్వేదానికి చెందిన 'కరోనిల్'ను చేర్చడం ద్వారా అది 'మిక్సోపతి' అవుతుందంటూ ఎద్దేవా చేసింది.
కరోనిల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదం లభించలేదని ఈ సందర్భంగా ఐఎంఏ గుర్తుచేసింది. కేంద్ర మార్గదర్శకాల్లో సైతం ఆయుర్వేద ఔషధాలను చేర్చలేదని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా అల్లోపతి, ఆయుర్వేదాన్ని కలపడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.