దిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య విభేదాలు నానాటికీ ముదురుతున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ దిల్లీ ప్రభుత్వ మేధో సంస్థ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ ఆఫ్ దిల్లీ (డీడీసీడీ) వైస్ ఛైర్మన్ జాస్మిన్ షా విధులు నిర్వర్తించకుండా ఎల్‌జీ వీకే సక్సేనా ఆంక్షలు విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు షా కార్యాలయాన్ని సీల్ చేశారు.
డీడీసీడీ వైస్ ఛైర్మన్ షా.. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తూ, రాజకీయ ఉద్దేశాలతో తన ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై భాజపా ఎంపీ పర్వేశ్ వర్మ ఎల్‌జీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఆరోపణలపై స్పందించాలంటూ ప్రణాళిక విభాగం డైరెక్టర్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కానీ, రెండు సార్లు అవకాశాలిచ్చినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఈ నోటీసులకు గానూ జాస్మిన్ షా తన సమాధానాన్ని ప్రణాళిక విభాగ డైరెక్టరుకు బదులుగా ఆ శాఖ మంత్రికి సమర్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో షా స్పందన తెలుసుకునేందుకు ఎల్‌జీ ఆఫీసు.. ఈ నెల 4న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. ఈ లేఖకు సీఎం ఆఫీసు నుంచి ఇప్పటివరకు సమాధానం రాకపోవడం వల్ల లెఫ్టినెంట్ గవర్నర్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.