Baby Heart Surgery: ముంబయి డాక్టర్లు అరుదైన ఘనత సాధించారు. కర్ణాటకకు చెందిన కార్తీక్ రాఠోడ్ అనే రెండు నెలల చిన్నారి గుండెకు పడిన 6 మిల్లీమీటర్ల రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండానే పూడ్చారు. ఇలా చేయడం దేశంలో తొలిసారి కాగా... ప్రపంచంలో ఇది రెండో శస్త్ర చికిత్స అని తెలిపారు.
చిన్నారి కాళ్లలో ఉండే సిరల ద్వారా గుండెకు ప్రత్యేక ట్యూబ్ను పంపి హృదయానికి ఉన్న రంధ్రాన్ని పూడ్చినట్లు ముంబయి జేజే ఆసుపత్రి డాక్టర్ కళ్యాణ్ ముండే తెలిపారు. చిన్నారికి ఉన్న సమస్యను వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారని పేర్కొన్నారు.
నో చెప్పిన ఆ వైద్యులు...
చిన్నారి పుట్టినప్పుడే గుండెలో సమస్య ఉంది. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేది. దీంతో సరిగా పాలు తాగక.. నిద్ర పోయేది కాదు, ఈ విషయాన్ని వైద్యులు దృష్టికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. పరీక్షలు చేయగా అసలు విషయం బయపడింది. దీంతో తల్లిదండ్రులు చాలా ఆసుపత్రులు తిరిగారు. చిన్నారి వయసుతో పాటు బరువు కూడా తక్కువ ఉండడం కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ఆస్పత్రుల వైద్యులు చికిత్స అందించేందుకు నిరాకరించారు. చివరకు ముంబయి జేజే ఆస్పత్రి డాక్టర్లు ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు.