ఛత్తీస్‌గఢ్ జశ్పుర్లో దారుణ ఘటన జరిగింది. పతాలగావ్లో దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి వెళుతుండగా.. ఓ బృందంలోని 20మందిపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఘటన నుంచి తేరుకున్న అనంతరం స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఘటన అనంతరం కారును స్థానికులు వెంబడించారు. కొద్దిసేపటి అనంతరం ఊరి చివర.. కారు మంటల్లో కాలుతూ కనపడింది. వాహనంలో భారీ మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్నారని, అందుకే వారే కారుకు నిప్పంటించారని స్థానికులు ఆరోపించారు.
ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారు. ఇద్దరిని అరెస్టు చేశారు. వారు మధ్యప్రదేశ్‌కు చెందిన బబ్లు విశ్వకర్మ, శిశుపాల్ సాహులుగా గుర్తించారు.
స్థానికుల ఆగ్రహం..
కారు దూసుకెళ్లిన ఘటన అనంతరం ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పతాల్గావ్ పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. నిరసన చేపట్టారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ పోలీసును నిరసనకారులు కొట్టినట్టు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులపైనా దాడి చేసినట్టు సమాచారం.