Loan App Online Scam: ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రూ.2000 రుణం తీసుకున్న ఓ వ్యక్తి.. సైబర్ కేటుగాళ్ల బెదిరింపులకు భయపడి రూ.15 లక్షలకుపైగా చెల్లించాడు. అయినా వేధింపులు తగ్గలేదు. చివరకు విసుగు చెందిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చిక్కబళ్లాపుర జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది.. జిల్లాలోని చింతామణి నగరానికి చెందిన అజ్మత్ ఉల్లా(37).. బెలగానహళ్లిలో ఉన్న నందిని డెయిరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అతడికి డబ్బు అవసరం పడింది. దీంతో ఓ స్నేహితుడి సూచన మేరకు మాజిక్ లోన్ యాప్‌లో(MAJIC LOAN APP) రూ.2000 అప్పు తీసుకున్నాడు. కొన్ని రోజులకు వడ్డీతో కలిపి రూ.3500 చెల్లించాడు. అయితే రుణం తీసుకున్న సమయంలో అజ్మత్ తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోలను అప్లోడ్ చేశాడు.
అజ్మత్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోను దుర్వినియోగం చేసిన ఆన్లైన్ మోసగాళ్లు.. 20కిపైగా వివిధ లోన్ యాప్‌లలో రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. దీంతో ఆ యాప్‌ల నుంచి అజ్మత్కు ఫోన్లు తెగ వచ్చేవి. అడిగిన మొత్తాన్ని చెల్లించని నేపథ్యంలో ఫొటోను మార్ఫింగ్ చేసి మహిళలతో నగ్నంగా ఉన్నట్లు వీడియోలను అజ్మత్ కుటుంబసభ్యులకు పంపుతామని కేటుగాళ్లు బెదిరించారు. దీంతో భయపడిన బాధితుడు తన ఎస్బీఐ బ్యాంక్ ఖాతా నుంచి రూ.14,43,799 మోసగాళ్లు ఖాతాకు బదిలీ చేశాడు. అంతే కాకుండా స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని మరీ వారికి చెల్లించాడు. అయినా మోసగాళ్ల నుంచి వేధింపులు తగ్గలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి:వేధించిన యువకుడిని చెప్పులతో చితక్కొట్టిన మహిళలు
పనిచేసే బ్యాంకుకే కన్నం 20 కోట్ల విలువైన బంగారం చోరీ