MIG 29K Crash Goa: సాధారణ సార్టీల్లో భాగంగా గాల్లోకి ఎగిరి తిరిగి స్థావరానికి వస్తుండగా.. మిగ్-29కే యుద్ధ విమానం బుధవారం గోవా తీరంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లు ఇండియన్ నేవీ అధికారులు తెలిపారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ ద్వారా పైలట్ ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీ(బీఓఐ) ఆదేశించిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం పైలట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు.
2019 నుంచి మిగ్-29కే విమానం కూలడం ఇది నాలుగోసారి. ఈ విమానంలో రష్యాలో తయారు చేసిన కే-36డీ-3.5 ఎజెక్షన్ సీట్లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటిని అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు.
- 2020 నవంబర్‌లో మిగ్-29కే విమానం కూలి ఒక పైలట్ మరణించగా.. మరో పైలట్‌ను కాపాడారు. ఈ ఘటన జరిగిన 11 రోజుల తర్వాత గానీ మరణించిన పైలట్ నిషాంత్ సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు.
- ఇక 2020 ఫిబ్రవరిలో మిగ్-29కేను పక్షి ఢీకొంది. దీంతో పైలట్లు శ్రమించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి ఎజెక్ట్ అయ్యారు.
- 2019లో గోవాలోని ఓ గ్రామ శివారులో నావికాదళానికి చెందిన మిగ్ 29కే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి పైలట్లు సరక్షితంగా బయటపడ్డారు.