తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కన్నా.. నీ పెళ్లి చూడలేకున్నా'.. రోడ్డు ప్రమాదంలో వరుడి తండ్రి మృతి - ఝార్ఖండ్​లో ఘోరమైన రోడ్డు ప్రమాదం

అపురూపంగా పెంచుకున్న కన్న కొడుకు పెళ్లి జరిపించాలని కోటి ఆశలతో వెళుతున్నాడు ఆ తండ్రి. కన్న కలలు నెరవేరకముందే మృత్యు ఒడిలోకి జారుకొని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. కొడుకు పెళ్లికి వెళుతుండగా జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రితో పాటు కారు డ్రైవర్ కూడా మరణించాడు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది.

A man died in a road accident while going to his son's wedding in West Bengal
బంగాల్​లో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

By

Published : Feb 28, 2023, 5:00 PM IST

పొద్దున్నే కన్నకొడుకు పెళ్లి. ఇన్నాళ్లూ పెంచి పెద్ద చేసిన కుమారుడి వివాహం చూడాలనే నిరీక్షణ ముగియబోతుంది అనుకుంటుండగానే.. కనికరం లేని కాల యముడు అతడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లాడు. బంగాల్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కన్న కొడుకు పెళ్లికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ట్రక్కు వచ్చి ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు ప్రమాదానికి గురైంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం వేకువజాముకు ముందు జరిగింది.

​మృతుడు అనిల్​ పాండే ఝార్ఖండ్​కు చెందిన వ్యక్తి. తన కొడుకు అరవింద్​ పాండే పెళ్లిని బంగాల్​లోని పానాగఢ్​లో జరపడానికి నిశ్చయించారు. అందుకనే వరుడి మేనమామలు శశిభూషణ్ పాండే (60), బల్దేవ్ పాండే (80)తో కలిసి అనిల్ పాండే స్కార్పియో కారులో పానాగఢ్​కు బయలుదేరారు. మార్గమధ్యంలో అసన్​సోల్ నార్త్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని కల్లా మోర్ వద్ద రెండో నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు.. కారును వెనకవైపు నుంచి వచ్చి ఢీ కొట్టింది. దాంతో కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో వరుడి తండ్రి అనిల్​ పాండే(65)తో పాటు కారు డ్రైవర్ సంతోష్ బిశ్వకర్మ (45) ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అసన్​సోల్ నార్త్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కారులో ఉన్న నలుగురిని రక్షించి అసన్​సోల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని... వరుడి మేనమామలు శశిభూషణ్ పాండే, బల్దేవ్ పాండే పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం పరీక్షల అనంతరం ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న అనిల్ పాండే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆనందోత్సవాల మధ్య పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడి తండ్రి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details