లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించి పెను రైలు ప్రమాదాన్ని తప్పించారు. కర్ణాటకలోని బీదర్ నుంచి కలబురగి వెళ్తున్న 07746 నంబర్ DEMU ప్యాసింజర్ రైలు వెళ్తుండగా.. పట్టాలపై పెద్ద బండరాయి పడింది. దీంతో లోకో పైలట్ అప్రమత్తమై సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. వల్ల దాదాపు వెయ్యి మంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదీ జరిగింది..సోమవారం ఉదయం 7.30 గంటలకు బీదర్ రైల్వేస్టేషన్ నుంచి కలబురగికి బయల్దేరింది DEMU ప్యాసింజర్ రైలు. కలబురగి జిల్లా కమలాపుర ప్రాంతంలోని మారగుట్టి సమీపంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో రైలు సొరంగంలోకి ప్రవేశించింది. ఆ మార్గంలో వెళ్తుండగా కొండపై నుంచి భారీ బండరాయి జారి ట్రాక్ పక్కన పడింది.
రైలు పట్టాల పక్కకు పడ్డ బండరాయి రైలు సొరంగంలోకి ప్రవేశించిన తర్వాత.. ట్రాక్ పక్కన బండ రాయి పడి ఉండటాన్ని లోకో పైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమై రైలును ఆపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో ఉన్న 1000 మందికి పైగా ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బండ రాయి కారణంగా రైలు రెండు గంటలపాటు నిలిచిపోయింది. కొందరు ప్రయాణికులు.. పొలాలు గుండా రెండు మూడు కిలోమీటర్లు నడిచి ప్రధాన రహదారిపైకి వచ్చి బస్సులు, ఆటోలో కలబురగికి వెళ్లారు. అనంతరం రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై ఉన్న బండను తొలగించారు. ఆ తర్వాత రైలు బీదర్ నుంచి కలబురగికి వెళ్లింది. అయితే, రైలు కదులుతున్న సమయంలో భూమి కంపించి కొండ చరియలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
పట్టాలపై నిరీక్షిస్తున్న ప్రయాణికులు వందేభారత్ ట్రయల్ రన్.. తప్పిన పెను ప్రమాదం..
పట్నా, రాంచీ మధ్య సోమవారం నిర్వహించిన వందేభారత్ రైలు ట్రయల్ రన్లో పెను ప్రమాదం తప్పింది. పట్నా నుంచి రాంచీ వస్తున్న సమయంలో ఝార్ఖండ్‌లోని పిప్రాడీ అనే గ్రామం సమీపంలో ట్రాక్‌పై ఆవు వచ్చింది. దీంతో అప్రమత్తమైన లోకోపైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలును ఆపారు. ఈ మేరకు ధన్‌బాద్ రైల్వే డివిజన్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ వెల్లడించారు. అయితే, రైలు ఝార్ఖండ్‌లోని కొడెర్మాకు రాకముందు నాలుగు చోట్ల ట్రాక్‌పై పశువులు వచ్చినట్లు సమాచారం. అయితే, వందేభారత్ రైళ్లు ఇలా ఆవులు అడ్డురావడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు పలు సందర్భాల్లో ట్రాక్‌లపై ఉన్న ఆవులను వందే భారత్ రైళ్లు ఢీకొట్టాయి.