A girl attends school with sister: పదేళ్ల వయసులో తమను తాము చూసుకోవటమే గగనం. పాఠశాలకు వెళ్లేందుకు రోజు పొద్దున అమ్మ సిద్ధం చేస్తే కానీ వెళ్లలేము. అయితే.. ఓ పదేళ్ల బాలిక స్కూల్‌కు వెళ్లటమే కాదు.. తన చెల్లిని చూసుకుంటోంది. తల్లిదండ్రులు తమ భవిష్యత్తు కోసం రేయింబవళ్లు పొలంలో కష్టాల సాగు చేస్తుంటే.. తన చెల్లిని చూసుకుంటూనే అక్షర సేద్యం చేస్తోంది. తరగతి గదిలో చెల్లెలిని ఎత్తుకుని పాఠాలు వింటోంది. మణిపుర్‌లోని తామెంగ్లాంగ్ జిల్లాకు చెందిన ఆ చిన్నారి ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తామెంగ్లాంగ్కు చెందిన 10 ఏళ్ల బాలిక మీనింగ్సిన్లియు పమీ.. తన చెల్లితో పాటు పాఠశాలకు హాజరవుతోంది. సోదరి ఆలనాపాలనా చూసుకుంటూనే పాఠాలు వింటోంది. చెల్లెలిని ఎత్తుకుని ఉన్న ఫొటో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తోంగమ్ బిశ్వజిత్ సింగ్ వద్దకు చేరింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర భాజపా నేతలను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో షేర్ చేశారు మంత్రి.