Airplane making at home: ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు జునైద్. కేరళ మలప్పురం చెమ్మాడ్‌కు చెందిన జునైద్ పదో తరగతిలోనే చదువు మానేశాడు. ఉన్నత చదువులు చదువుకుని.. జీవితంలో గొప్ప స్థాయికి చేరాలని ఆశపడ్డాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతడ్ని.. పదో తరగతి మధ్యలోనే చదువు మానేసేలా చేశాయి. పూటగడిచేందుకు కూలీగా మారాడు. అయినా అతని ఆలోచనలు, లక్ష్యాలు ఏమాత్రం మారలేదు. విమానం తయారు చేయాలని కలలు కనేవాడు. యూట్యూబ్ వంటి అంతర్జాల వేదికల్లో వీడియోలు చూసి నైపుణ్యం పొందాడు.
ఈ క్రమంలో ఎన్నోసార్లు విఫలం చెందినా.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి అనుకున్నది సాధించాడు. రిమోట్ ద్వారా నియంత్రించే చిన్నపాటి విమానాలను రూపొందించాడు. జునైద్ ఇప్పటివరకు 30కి పైగా రిమోట్ విమానాలను తయారు చేశాడు. చిన్న మోటార్లు, థర్మకోల్ షీట్లు వంటి తేలికపాటి వస్తువులను.. తయారీలో ఉపయోగించాడు. ల్యాండింగ్, టేకాఫ్‌లోనూ ఈ విమానాలు.. అచ్చం నిజమైన విమానాల్లా కనిపిస్తున్నాయి.