90 Years Old Man Committed Suicide In Siddipet: పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు .. వారే తమ జీవితమని, కడవరకు చూస్తారని నమ్ముతారు. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. వారి ఆలనాపాలనా చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినాసరే.. తమ ప్రాణం పోయేంతలా కన్నవారు విలవిలలాడుతారు. తీరా వారు పెద్దవారైన తర్వాత చూస్తే.. అమ్మానాన్నలే అవసరం లేదని చెప్పేసిన కుమారులు, కుమార్తెలు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారి దగ్గర నుంచి ఆస్తి కావాలి కాని.. కన్నవారు మాత్రం అవసరం లేదు. వారిని కన్న పాపానికి చివరుకు వీధిపాలు చేసి.. అభాగ్యులుగా మార్చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ వృద్ధుడు చనిపోయిన తీరు అందరికి కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. భర్త చనిపోతే భార్య బతికుండగానే చితిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం నాటి సతీసహగమనం అయితే.. నేడు బతికున్న కన్న తండ్రి చితి పేర్చుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఏమనాలి..?
తొంభై ఏళ్ల వయసున్న వెంకటయ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో నివాసం ఉంటున్నారు. భార్య గతంలోనే తనువు చాలించింది. వీరి దాంపత్య జీవితంలో నలుగురు కుమారులు కనకయ్య, ఉమ్మయ్య, పోచయ్య, ఆరయ్య, ఓ కుమార్తె పుట్టారు. వెంకటయ్య తనకున్న స్థిరాస్తిని, నాలుగు ఎకరాలకు భూమిని పిల్లలకు పంచి ఇచ్చారు. తన పిల్లలు కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ.. తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ: ఆ కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్లోనూ, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేటలో నివసిస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నారు. పొట్లపల్లిలో నివాసం ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య ఇంటి వద్దనే.. వృద్ధాప్యంలో ఉన్న వెంకటయ్య ఉండేవారు. ఆ ముసలివానికి వృద్ధాప్య పింఛను కూడా వస్తోంది. ఆ 90 ఏళ్ల తండ్రి పోషణ చూసుకోలేక.. కుమారులు అయిదు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. నెలకు ఒకరు చొప్పున వంతుల వారిగా పోషించాలని కుమారులు నిర్ణయించుకున్నారు.