దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో కేవలం 28% మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72% నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన 'అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా' అన్న నివేదికలో పేర్కొంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నీటి శుద్ధీకరణ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. "ప్రస్తుత దేశ జనాభా 138 కోట్లు. అందులో 65% (90 కోట్లమంది) గ్రామీణప్రాంతాల్లో ఉంటే 35% మంది (48 కోట్లమంది) పట్టణప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 39,604 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంటే, పట్టణ ప్రాంతాల నుంచి 72,368 మిలియన్ లీటర్లు వస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరగడంతో నీటి వినియోగం పెరిగింది.
రోజుకు 28 శాతమే శుద్ధి
ప్రస్తుతం దేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో 28% (రోజుకు 20,236 మిలియన్ లీటర్లు) మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలిన 72% శుద్ధిచేయని మురుగునీరు నదులు, సరస్సులు, భూగర్భంలో కలుస్తోంది. దానివల్ల ఆ జలవనరుల్లోని నీరు కలుషితమై నాణ్యత దిగజారుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని 323 నదుల పరిధిలోని 351 పాయల్లో ప్రవహించే నీటి నాణ్యతను బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ద్వారా కొలుస్తోంది. దాని ప్రకారం 13% భారతీయ నదీ పాయలు తీవ్రంగా కలుషితం అయ్యాయి. బీఓడీకి తోడు కెమికల్ ఆక్సిజన్ స్థాయి, భారలోహాలు, ఆర్సెనిక్, ఫ్లోరైడ్స్, ప్రమాదకరమైన రసాయనాలు అత్యధికచోట్ల కనిపించాయి. మరీ ముఖ్యంగా భూగర్భజలాల్లో వీటి శాతం ఎక్కువ కనిపించింది. అందువల్ల ఉత్పత్తి అవుతున్న, శుద్ధిచేస్తున్న నీటి మధ్య ఉన్న అగాధాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.