తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంతులేని కథగా జైళ్లలో మానవ హక్కుల హననం!

జాతీయ నేర రికార్డుల సంస్థ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం, భారతీయ కారాగారాల్లో దాదాపు నాలుగు లక్షల 80వేల మంది ఉన్నారు. వారిలోని ప్రతి పదిమందిలో ఏడుగురు విచారణ ఖైదీలే. ఎకాయెకి 70శాతం ఖైదీలు అండర్‌ట్రయల్స్‌గానే(Under Trial Prisoners) ఏళ్లూ పూళ్లూ జైళ్లలో కునారిల్లడం- చెరలో చిక్కిన పౌరస్వేచ్ఛను(Civil Liberty) కళ్లకు కడుతోంది. నేరం నిర్ధరణ కాకుండానే అన్నేళ్లపాటు ఒక వ్యక్తి చెరసాలకే పరిమితం కావడం కన్నా దురన్యాయం ఇంకేముంటుంది?

under trial prisoners
విచారణ ఖైదీలు

By

Published : Sep 1, 2021, 7:47 AM IST

'కనీసం అభియోగాలైనా నమోదు చేయకుండా నిందితుణ్ని పదకొండేళ్లపాటు జైలులో ఉంచుతారా?' అన్న సుప్రీంకోర్టు(Supreme Court) సూటిప్రశ్న- దేశంలో నేరన్యాయ అవ్యవస్థ పాలిట చర్నాకోలా. 28 ఏళ్లక్రితంనాటి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు పేలుడు కేసులో(1993 Train Blast case) నిందితుడు హమీర్‌ ఉల్‌ ఉద్దీన్‌ 2010 నుంచి కస్టడీలోనే ఉన్నాడు. సంబంధిత న్యాయస్థానం అతడిపై అభియోగాలు నమోదు చేయని కారణంగా, ఇప్పటివరకు విచారణ ప్రారంభమే కాలేదు. నేరం నిర్ధరణ కాకుండానే అన్నేళ్లపాటు ఒక వ్యక్తి చెరసాలకే పరిమితం కావడం కన్నా దురన్యాయం ఇంకేముంటుంది? సరిగ్గా ఈ కీలకాంశాన్నే సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది.

ఆ హక్కు ఖైదీలకు వర్తిస్తుందని...

మునుపటి ఎన్నో తీర్పులు స్పష్టీకరించినట్లు- రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా పౌరులందరికీ సంక్రమించిన గౌరవప్రదంగా జీవించే హక్కు ఎవరూ ఉల్లంఘించ వీల్లేనిది. న్యాయస్థానాలు నిర్దిష్టకాలానికి పరిహరించిన పౌరహక్కులు తప్ప మానవ హక్కులు ఖైదీలకూ వర్తిస్తాయని సుప్రీంకోర్టు(Supreme Court) లోగడ పలుమార్లు ధ్రువీకరించింది. వాస్తవంలో ఖైదీలు పెద్దయెత్తున కారాగారాల్లోనే కునారిల్లడం వారి హక్కుల్ని తొక్కిపట్టడమేనని మూడున్నరేళ్లక్రితం జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం ఆవేదనాభరితంగా స్పందించింది. 'విచారణ ఖైదీగానే చనిపోతానేమో'నని ఆక్రందిస్తూ బెయిలు కోసం శతవిధాల యత్నించి విఫలమైన ఫాదర్‌ స్టాన్‌ స్వామి విషాదాంతాన్ని ఇప్పట్లో ఎవరూ మరచిపోలేరు. బాల్యదశలోనే నేరానికి పాల్పడినట్లు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు నిర్ధరించినప్పటికీ- ఇరవై ఏళ్లపాటు ఆగ్రా జైలులో మగ్గిపోయిన 13 మందికి కడకు సుప్రీంకోర్టు జోక్యంతోనే ఇటీవల విముక్తి లభించింది. తాజాగా హమీర్‌ ఉల్‌ ఉద్దీన్‌ ఉదంతం జైళ్లలో మానవ హక్కుల క్రూర హననం అంతులేని కథగా కొనసాగుతున్నదనడానికి దృష్టాంతంగా నిలుస్తోంది!

పది మందిలో ఏడుగురు..

కొన్నేళ్లక్రితం అయిదుగురు విచారణ ఖైదీలు అస్సాం మానసిక చికిత్సాలయంలో దుర్భర స్థితిగతుల్లో బతుకీడుస్తున్న వైనం తెలిసి జాతీయ మానవ హక్కుల సంఘం నిర్ఘాంతపోయింది. దేశవ్యాప్తంగా విచారణ ఖైదీల సంఖ్య పదుల్లోనో వందల్లోనో లేదు. జాతీయ నేర రికార్డుల సంస్థ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం, భారతీయ కారాగారాల్లో దాదాపు నాలుగు లక్షల 80వేల మంది ఉన్నారు. వారిలోని ప్రతి పదిమందిలో ఏడుగురు విచారణ ఖైదీలే. ఎకాయెకి 70శాతం ఖైదీలు అండర్‌ట్రయల్స్‌గానే (Under Trial Prisoners) ఏళ్లూ పూళ్లూ జైళ్లలో కునారిల్లడం- చెరలో చిక్కిన పౌరస్వేచ్ఛను కళ్లకు కడుతోంది. అవసరం లేకున్నా అరెస్టు చేయడం మానుకోవాలని న్యాయపాలిక పదేపదే హితవు పలుకుతున్నా, నిందితుల్ని శిక్షించేలా బెయిలును బిగపట్టకూడదని దశాబ్దాలుగా ఉద్బోధిస్తున్నా- అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విచారణ ఖైదీల సగటు 32 శాతం; అంతకు రెండింతలకు పైగా ఇక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు.

జైళ్లు వృద్ధాశ్రమాలవుతాయేమో!

పేదరికం వల్ల పూచీకత్తులు సమర్పించలేక వందల సంఖ్యలో ఖైదీలు కటకటాల్లోనే కమిలిపోతున్నారని ఆమధ్య దిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తపరచింది. విచారణకు నోచకుండానే వివిధ ఆరోపణల కింద గరిష్ఠ శిక్షాకాలంలో సగందాకా జైల్లోనే ఉన్నవారికి విముక్తి కల్పించాలని ఏడేళ్లక్రితమే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు శాసన సంస్కరణల కోసం న్యాయ సంఘం సిఫార్సులు సమర్పించింది. విచారణ ప్రక్రియలో విపరీత జాప్యాన్ని, అధికార యంత్రాంగంలో నిజాయతీ కొరవడటాన్ని, చట్టాల్లో లెక్కకు మిక్కిలి లొసుగుల్ని అది ఆక్షేపించింది. విచారణ ఖైదీల సంఖ్య ఇంతలంతలవుతుంటే జైళ్లను వృద్ధాశ్రమాలుగా మార్చాల్సి వస్తుందేమో! సత్వర న్యాయమన్నది మానవ హక్కుల్లో అంతర్భాగం. నిర్ణీత వ్యవధిలో విచారణ పూర్తికాని పక్షంలో ఖైదీల్ని విడిచిపుచ్చేలా సంస్కరణలు సాకారమైతేనే, దేశంలో జీవన హక్కుకు మన్నన దక్కుతుంది!

ఇదీ చూడండి:'వారి పరిస్థితి చూస్తే హృదయం ముక్కలవుతోంది'

ఇదీ చూడండి:Supreme Court: వ్యక్తిస్వేచ్ఛకు 'నిర్బంధ' గ్రహణం

ABOUT THE AUTHOR

...view details