Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కూలీలతో వెళ్తున్న ఓ వాహనం రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో అక్కడిక్కడే ఏడుగురు మరణించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కూలీలు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
స్థానికుల సహాయంతో వాహనం కింద ఇరుక్కున్న వారిని బయటకు తీశామని పోలీసులు చెప్పారు. క్రూజర్ వాహనం అక్కాతంగియరహళ్ల గ్రామం నుంచి వెళ్తుండగా బెళగావి రహదారిలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కూలీలంతా బెళగావికి రోజువారీ పనుల కోసం వెళ్తున్నారని చెప్పారు. వాహనంలో 18 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు.