Digital Campaign five state elections: హోరెత్తించే మైకులు, ర్యాలీలు, పోటాపోటీగా సభలు.. భారీగా జనసమీకరణలు.. సభల్లో పంచ్ డైలాగ్‌లు.. ఆకట్టుకునే పాటలు.. వ్యంగ్యాస్త్రాలు.. ఛలోక్తులు.. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా.. ప్రచారంలో ఇవి సర్వసాధారణం. అయితే ఇది కరోనా రాక ముందు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రచార శైలి మారిపోయింది.
వచ్చే నెల జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఫలితంగా ప్రత్యక్ష ప్రచారానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో రాజకీయ పార్టీలు డిజిటల్, వర్చువల్ ప్రచారాలపైనే దృష్టి సారిస్తున్నాయి. ఇందుకోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాలను వినివియోగించుకుంటున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని.. పంచ్ డైలాగ్‌లు, ఆకట్టుకునే పాటలు, వ్యంగ్యాస్త్రాలు, ఛలోక్తులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి.
మోదీ, యోగి పంచ్ డైలాగ్స్‌తో సాంగ్.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఓ ప్రచారగీతాన్ని విడుదల చేసింది. శ్రీలంకలో ఎంతో పాపులరైన పాటకు పేరడీగా.. భాజపా తన ప్రచార గీతాన్ని ఆవిష్కరించింది. అందరి మనసులో ఒకటే ఉంది. రెండు ఆశలు....అదే మోదీ, యోగి.. వారివల్ల ఎంతో ఉపయోగం.. ఇలా ఆ పాట సాగుతుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, చేసిన సంక్షేమం, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలను ప్రచార గీతంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రచార గీతానికి భాజపా నేతలు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించారు. ఈ పాటలో మధ్యమధ్యలో జోడించిన ప్రధాని మోదీ, సీఎం యోగి పంచ్ డైలాగ్‌లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీ పాటకు సూపర్ రెస్పాన్స్.
యూపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ కూడా డిజిటల్ ప్రచారంలో దూసుకుపోతోంది. భాజపా నాయకత్వంపై దూకుడుగా వ్యవహరిస్తోంది. భాజపా అగ్రశ్రేణి నాయకులపై పంచ్ డైలాగ్‌లతో తమదైన ప్రచార వ్యూహంతో ముందుకెళ్తోంది ఎస్పీ. ఈ ఎన్నికల్లో భాజపాను ఒడించాలని అర్థం వచ్చేలా అవధ్ మాండలికంలో రూపొందించిన ప్రచార గీతం మంచి ఆదరణ పొందింది.
కొంకణి భాషలో తృణమూల్ పాట..
గోవాలో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రచారం కోసం కొంకణి భాషలో ఓ పాటను రూపొందించింది. టీఎంసీ ఎన్నికల గుర్తును ప్రతిబింబించేలా ఈ పాట ఉంటుంది. రెండు పువ్వుల యుగం వచ్చిందని, గోవాలో కొత్త అధ్యాయం మొదలుకానుందనే అర్థంవచ్చేలా ప్రచార గీతాన్ని రూపొందించారు.