బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించేందుకు వెళ్తున్న యాత్రికుల ఆటోను ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాలు..
సహర్సా జిల్లాకు చెందిన యాత్రికులు మహాదేవ్పుర్ ఘాట్‌లోని గంగా నదిలో పుణ్యస్నానం చేసేందుకు ఆటోలో సోమవారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో మాధేపురా వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం చౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాసన్-చౌసా రాష్ట్ర జాతీయ రహదారిపై జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని చౌసా కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)కి తరలించారు.
యాత్రికుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంకొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు క్షతగాత్రులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మృతులు.. సహర్సా జిల్లాలోని దుర్గాపుర్ బద్ది గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మాధేపురాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.