తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జవాన్లపై 400 మంది నక్సలైట్ల ముప్పేట దాడి! - బీజాపుర్​లో నక్సల్స్​ ఎన్​కౌంటర్​

ఛత్తీస్​గఢ్​ దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. తమకు పట్టున్న ప్రాంతంలోకి వచ్చిన భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులతో పేట్రేగిపోయారు. మూడు వైపుల నుంచి కమ్ముకొని దళాలపై దాడికి తెగబడ్డారు. నక్సల్స్‌ దాడికి భద్రతా దళాలు దీటుగా స్పందించడం వల్ల అటు మావోయిస్టులూ చివరకు ప్రాణ నష్టంతో తిరిగివెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.

400 Naxals had ambushed security personnel with heavy gunfire in Chhattisgarh: Sources
దద్దరిల్లిన దండకారణ్యం- 400 మంది మావోలు దాడి!

By

Published : Apr 4, 2021, 5:49 PM IST

Updated : Apr 4, 2021, 6:43 PM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపూర్​లోని అడవుల్లో చరిత్రలోనే భద్రతాదళాలపై అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తున్న ఎదురుకాల్పుల ఘటనలో దాదాపు 400 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.

బీజాపుర్‌-సుకుమా జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలోని జాగర్‌గుండా, జొంగాగూడ, తారెం ప్రాంతంలో వ్యూహత్మక ప్రతిదాడిపై మావోయిస్టులు చర్చలు జరుపుతున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతాదళాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో సీఆర్​పీఎఫ్​కు చెందిన ప్రత్యేక అటవీ విభాగం 'కోబ్రా' సహా బస్తరీయా బెటాలియన్‌, ఛత్తీస్‌గడ్ పోలీసులకు చెందిన డీఆర్​జీ బృందాలు పాల్గొన్నాయి. మొత్తంగా 6 క్యాంపులకు చెందిన 15వందల మంది జవాన్లు.. ఆపరేషన్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 790 మంది ఆపరేషన్‌ కోసం అడవుల్లోకి వెళ్లగా మిగతా వారు వారికి సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

రెచ్చిపోయిన నక్సల్స్..

ఘటనా స్థలం వ్యూహాత్మకంగా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం. కఠిన భూభాగంతో పాటు తక్కువ సంఖ్యలో భద్రతా బలగాల కదలికలు ఉండే గ్రామం అది. జవాన్లు సరిగ్గా అక్కడకు చేరుకోగానే దాదాపు 400 మంది నక్సల్స్‌ మూడు వైపుల నుంచి చుట్టుముట్టారు. జవాన్లపై లైట్‌ మెషిన్‌ గన్లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. వీటితో పాటు తక్కువ ప్రభావం చూపే ఐఈడీ బాంబులను విసిరారు. ఈ ఎదురుకాల్పుల్లో 23 మంది అమరులయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చూడండి:బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో 23 మంది జవాన్లు మృతి

దీనికి భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించాయి. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పులు రాత్రి వరకు కొనసాగాయి. ఘటనలో దాదాపు 10 నుంచి 12 మంది.. మావోయిస్టుల చనిపోగా, వారిని సహచర మావోయిస్టులు ట్రాక్టర్‌ ట్రాలీల్లో తీసుకువెళ్లిపోయారు. ఈ దాడికి మావోల నుంచి పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌కు చెందిన హిద్మా, సుజాత నేతృత్వం వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

జవాన్ల తెగువ..

మధ్యాహ్నం రెండు గంటలకు భద్రతా దళాలు హెలికాఫ్టర్లను సాయం కోసం కోరగా, భీకర కాల్పుల కారణంగా అవి సాయంత్రం 5 గంటల వరకు ఘటనా స్థలంలో ల్యాండ్‌ కాలేని పరిస్థితి నెలకొంది. చాలావరకు జవాన్లు..... బుల్లెట్‌ గాయాలతోనే మరణించారని అధికారులు తెలిపారు. సహచర జవాన్లు నేలరాలుతున్నా కోబ్రా యూనిట్‌ ధైర్యంగా పోరాడిందని అధికారులు ప్రశంసించారు. వీరి ధైర్యం వల్లే నక్సల్స్‌ మరికాసేపు కాల్పులను కొనసాగించలేకపోయారని తెలిపారు. పెద్ద చెట్లను అడ్డుగా చేసుకొని, బుల్లెట్లు అయిపోయే వరకు భద్రతా బలగాలు ప్రతిఘటించారన్నారు. భద్రతా దళాలకు చెందిన దాదాపు 2 డజన్ల ఆధునాతన ఆయుధాలను నక్సల్స్‌ లూటీ చేశారని అధికారులు వెల్లడించారు.

ఘటనపై అమిత్​ షా ఆరా..

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​తో ఫోన్​లో మాట్లాడారు. సీఆర్​పీఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ కుల్దీప్​ సింగ్​ను పరిస్థితిని సమీక్షించాలని షా ఆదేశించారు.

ఎన్​కౌంటర్​లో అమరులైన భద్రతా సిబ్బంది కుటుంబాలకు అమిత్​ షా సంతాపం తెలిపారు. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. శాంతి వ్యతిరేకులపై తమ పోరాటం కొనసాగుతుందని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:15 మంది జవాన్లు మిస్సింగ్​- అమిత్​ షా ఆరా

Last Updated : Apr 4, 2021, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details