4 Dead Bodies Found In Home : కర్ణాటకలోని మైసూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద రీతిలో మరణించారు. నలుగురి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మృతులను మహదేవస్వామి కుటుంబసభ్యులుగా గుర్తించినట్లు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని బరదనపుర్ గ్రామానికి చెందిన మహదేవస్వామి(48).. మైసూరు నగరంలో ఆర్‌ఎంసీ మార్కెట్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మహదేవస్వామి.. తన భార్య అనిత(35), ఇద్దరు కుమార్తెలతో చాముండిపురం కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. విద్యారణ్యపురంలో కొన్నేళ్లు పాటు నివాసం ఉన్న మహదేవస్వామి కుటుంబుం.. ఇటీవలే చాముండిపురం కాలనీలోకి వచ్చింది.
అయితే ఆదివారం మధ్యాహ్నం.. మహదేవస్వామి ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. తలుపులు బద్దలుకొట్టి లోపలకి వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంటి హాలులో మహదేవస్వామి మృతదేహం.. లభ్యమైందని పోలీసులు తెలిపారు. కుర్చీపై భార్య అనిత, గదిలో కుమార్తెలు విగతజీవులుగా కనిపించారని పోలీసులు చెప్పారు. రెండ్రోజుల క్రితమే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడం వల్లే మహదేవ స్వామి అప్పులపాలయ్యాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మృతుడు మహదేవస్వామి తండ్రి సోమప్ప కూడా కొన్ని నెలల క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు. మహదేవస్వామి ఆర్థిక పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం లేదని మృతుడి సోదరుడు అశోక్ తెలిపాడు. లోన్ తీసుకున్నాడో లేదో కూడా తనకు తెలియదని చెప్పాడు. మహదేవస్వామి మాతో పెద్దగా టచ్‌లో లేరని అతడి అత్త విశాలాక్షి.. పోలీసులకు చెప్పింది.