Girls Love Marriage: ఇద్దరు యువతుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఒకరికొకరు మనుసులు ఇచ్చిపుచ్చుకున్నారు. జీవితాంతం కలిసే ఉండాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో వాళ్లను ఎదురించి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్, చురు జిల్లాలో రతన్‌గఢ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రతన్‌గఢ్‌లోని తన సోదరి అత్తారింటికి ఏడాది క్రితం వచ్చింది. ఈ క్రమంలో తన సోదరి ఆడపడుచు(18)తో ఆమెకు స్నేహం ఏర్పడింది. కొద్ది రోజులకు ఇరువురి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఒకరికొకరు మనుసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వారి ప్రేమ ఇంట్లో వాళ్లకు తెలిసింది. దీంతో వారి నిర్ణయానికి అడ్డుచెప్పారు. ఇద్దరు కలుసుకోకుండా చేశారు.
2021, నవంబర్ 12న రతన్‌గఢ్‌కు చెందిన యువతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. హరియాణాలోని అదంపుర్ మండీకి చేరుకుని తన ప్రేయసిని కలుసుకుంది. ఇరువురు కలిసి అక్కడి నుంచి ఫతేబాద్‌కు చేరుకుని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత జింద్‌లో గత రెండు నెలలుగా కాపురం ఉంటున్నారు.
నవంబర్ 14న రతన్‌గఢ్ యువతి తండ్రి.. తన కుమార్తె కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. 2022, జనవరి 12న ఇద్దరు యువతులను గుర్తించారు. తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసులు, అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువతులు తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. కలిసే ఉంటామని తెగేసి చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక ఇష్టమైన జీవితాన్నే గడపాలని అక్కడి నుంచి పంపించారు పోలీసులు.
ఇదీ చూడండి:ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి!