17 Crore Injection For Child : ఉత్తర్‌ప్రదేశ్ సహారన్పుర్కు చెందిన భూదేవ్ అనే బాలుడు 15 నెలలకే చావుతో పోరాడి గెలిచాడు. ఎస్ఎంఏ-టైప్1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ బాలుడు బతకాలంటే 17 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. రెక్కాడితేగానీ డొక్కాడని భూదేవ్ కుటుంబానికి 17 కోట్లంటే మామూలు విషయం కాదు.
కానీ, విధి భూదేవ్ పక్షానే నిలిచింది. అతడికి సాయం చేసేందుకు ఫార్మా దిగ్గజం నొవార్టిస్ ముందుకొచ్చింది. ఎంతో మంది దాతలు సైతం భూదేవ్ కోసం కదిలారు. 'సేవ్ భూదేవ్' క్యాంపెయిన్‌ను నడిపించారు. కేంద్ర ప్రభుత్వం సైతం తన వంతుగా ఈ ఇంజెక్షన్‌ను దిగుమతి సుంకం నుంచి మినహాయించింది. ప్రభుత్వం నిర్ణయంతో రూ.17 కోట్లుగా ఉండే ఇంజెక్షన్ ధర రూ.10 కోట్లకు దిగివచ్చింది. దాతల సాయంతో దిగుమతి చేసుకున్న ఈ ఇంజెక్షన్‌ను బాలుడికి ఇచ్చారు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు.
"భూదేవ్కు ఇంజెక్షన్ డోసు ఇస్తారన్న విషయం వారం క్రితం మాకు తెలిసింది. దీంతో మా కుటుంబంలో అందిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భూదేవ్ ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా."
-గౌరవ్ శర్మ, భూదేవ్ కుటుంబ సభ్యుడు
త్వరలో కోలుకునే అవకాశం!
భూదేవ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని బాలుడికి ఇంజెక్షన్ ఇచ్చిన దిల్లీ ఎయిమ్స్ డాక్టర్ షెఫాలీ గులాటీ పేర్కొన్నారు. పూర్తిగా కోలుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని తెలిపారు.