13వ బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు(brics summit 2021) భారత్ నేతృత్వంలో ఈనెల 9న జరగనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. 2012, 2016 తర్వాత బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వటం ఇది మూడోసారి.
2020లో వర్చువల్గా..
కరోనా మహమ్మారి కారణంగా 2020 సదస్సును(brics summit 2020).. రష్యా నేతృత్వంలో వర్చువల్గా నిర్వహించారు. తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయలో సైనిక ఘర్షణ తర్వాత తొలిసారి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే వేదికపై సమావేశమయ్యారు. అంతకు ముందు.. 11వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం జరిగింది. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ)లో(ndb brics bank) కొత్తగా చేరిన క్రమంలో బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను ఈ సమావేశానికి ఆహ్వానించింది భారత్. బ్రిక్స్ డిజిటల్ హెల్త్ సమ్మిట్లో కొవిడ్-19 మహమ్మారితో ఎదురైన సవాళ్లు, అవకాశాలపై మాట్లాడింది భారత్. అలాగే.. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల ఇంధన మంత్రుల సమావేశం నిర్వహించారు.