ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో జికా(Zika Virus In Kanpur) వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 13మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో కాన్పుర్‌లో జికా వైరస్ బాధితుల సంఖ్య 79కి చేరింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో జికావ్యాప్తి నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు రాష్ట్రం అయినందు వల్ల.. వైరస్ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ఇంటింటికీ వెళ్లి పరీక్షలు
వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి కాన్పుర్ జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా(Zika Virus In Kanpur) లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటైజేషన్, ఫాగింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాయుసేన సిబ్బందికి జికా(Zika Virus In Kanpur) సోకిన నేపథ్యంలో.. ఐఏఎఫ్ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు మరో అధికారి తెలిపారు.
ఏమిటీ జికా వైరస్?
జికా వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్ ఈజిప్టి, ఎడిస్ ఆల్బోపిక్టస్ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.
ఇదీ చూడండి:బైక్‌ను ఢీకొన్న రైలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి