మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ప్రముఖ ఆలయ ట్రస్టులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు.. 12 ఏళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డారు. బాలికను మభ్యపెట్టి గురువారం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లిన వారిద్దరూ.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. శరీరమంతా గాయాలు చేశారు. కర్రను ఆమె ప్రైవేట్ భాగాల్లోకిచొప్పించి.. ఉన్మాదాన్ని చాటుకున్నారు. నిందితులిద్దరినీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిద్దరికి 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది.
తీవ్ర రక్తస్రావంతో అచేతనంగా ఉన్న బాధితురాలిని ప్రాథమిక చికిత్స అనంతరం రేవాలోని ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. బాలిక శరీరంపై పలుచోట్ల పంటిగాట్లు, గాయాలు ఉన్నాయని సత్నా ఎస్పీ అశుతోష్ గుప్తా తెలిపారు. తమ ఉద్యోగుల తీరుతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగినందున వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంబంధిత కమిటీ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో ఆడపిల్లలకు రక్షణ కరవైందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ విమర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యసాయం అందించి.. రూ.కోటి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.